అంగన్ వాడీలు విధుల్లో చేరాలని.. లేదంటే తొలగిస్తామని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్ వాడీలకు అండగా ఉంటామని జనసేనాని ప్రకటించారు. అంగన్ వాడీలను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. దాదాపు 42 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరీ అప్రజాస్వామికంగా ఉందని ఆయన మండిపడ్డారు.
నామమాత్రపు వేతనాలతో సేవలందిస్తున్న మహిళలతో సామరస్య పూర్వకంగా చర్చలు చేయకుండా విధుల నుంచి తొలగించారని ఆదేశాలు ఇవ్వడం.. పోలీస్ చర్యలకు దిగడం పాలకుల ధోరణినీ తెలియజేస్తోందని పవన్ ఎద్దేవా చేశారు. సీఎం కోటి సంతకాలతో కూడిన వినతిపత్రం ఇచ్చేందుకు చలో విజయవాడ కార్యక్రమం చేపడితే అర్థరాత్రి వేళ పోలీసుల అంగన్ వాడీలను ఈడ్చివేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ సిబ్బందిని అరెస్టులు చేయడం.. వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.