మేడిగడ్డ నిర్మాణంలో భారీగా లోపాలు.. విజిలెన్స్‌ దర్యాప్తులో బట్టబయలు

-

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇటీవల బ్యారేజీని సందర్శించిన విజిలెన్స్‌ బృందం క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్ల నుంచి అవసరమైన సమాచారం, రికార్డులు కోరగా వారు నీళ్లు నమిలినట్లు తెలిసింది. బ్యారేజీ ఏడో బ్లాక్‌ కుంగిపోవడమే కాకుండా గేట్ల దిగువన నీళ్లు పడేచోటు(గ్లేసియర్స్‌) దెబ్బతినడం, రెండు పియర్స్‌ మధ్య ఉన్న గోడ మధ్యలో కాంక్రీటు లేచిపోవడం, పియర్స్‌ బాగా పాడవ్వడంతో నాణ్యతపై విజిలెన్స్‌ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మేడిగడ్డలో బ్యారేజీలో పియర్స్‌ బాగా దెబ్బతిన్నాయని 7వ బ్లాక్లోని 20వ పియర్ మాత్రమే కాకుండా దానికి ఇరువైపులా ఉన్న 19, 21 పియర్స్‌ దెబ్బతిన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇతర బ్లాకుల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోందని సుమారు 11 పియర్స్‌పై ప్రభావం పడినట్లు విజిలెన్స్ పరిశీలనలో తేలింది. 22వ పియర్‌ బీటలు వారగా.. 11వ పియర్‌ సైతం నిలువుగా చీలినట్లు బీటలు కనిపించినట్లు సమాచారం. వీటితో పాటు 26వ పియర్‌ గేటుకు దిగువ భాగాన, 19వ పియర్‌కు పగుళ్లు తేలినట్లు తెలిసింది.

మరోవైపు బ్యారేజీ గేట్ల వద్ద గ్లేసియర్స్‌ కూడా దెబ్బతిన్నాయని.. ఆరో బ్లాక్‌లోని 25-26 పియర్స్‌ గోడ మధ్యలో ఉన్న కాంక్రీట్‌ కొట్టుకుపోయి కుప్పలా పడిందని విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో తేలింది. 29-30వ పియర్స్‌ మధ్య గేటు దిగువ కొంతభాగం కొట్టుకుపోయి పగుళ్లు కూడా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇలా మేడిగడ్డ బ్యారేజీలో భారీగా నాణ్యత లోపాలు బయటపడినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news