మెట్రో ఫేజ్-2 ప్రాథమిక అంచనా వ్యయం రూ.17,500 కోట్లు

-

హైదరాబాద్లో మెట్రో రైలు ఫేజ్-2లో భాగంగా ఏడు మార్గాల్లో 70 కి.మీ. మేర రైలును విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఇందుకోసం దాదాపు రూ.17,500 కోట్ల వరకు అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎన్నేళ్లలో ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తారనే దాన్ని బట్టి అంచనా వ్యయాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని అంటున్నారు. మూడు నెలల్లో సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) సిద్ధమవుతుందని, డీపీఆర్‌ రాగానే కచ్చితమైన నిర్మాణ వ్యయం వెల్లడికానుందని హైదరాబాద్‌ మెట్రోరైలు (హెచ్‌ఎంఆర్‌) వర్గాలు వెల్లడించాయి. ఆ నివేదికలో కచ్చితమైన అంచనా వ్యయం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం ఐదేళ్లలో మెట్రో విస్తరణ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలంటే ఏటా రూ.3,500 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని మెట్రో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తేనే పనులు మొదలవుతాయని తెలిపాయి. మొదటి ఏడాది డీపీఆర్‌ రూపకల్పన, భూసేకరణ, ఇతర ముందస్తు పనులు చేయాల్సి ఉండగా.. రెండో ఏడాది నుంచి  భారీగా కేటాయింపులు చేయాల్సి ఉంటుందని.. ఇందుకోసం జైకా, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి  రుణాలు సమీకరించడం వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉందని అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news