జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే వివిధ అంశాలపై లేఖలు రాస్తూ వచ్చిన మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరి రామ జోగయ్య.. ఇప్పుడు పవన్ కు బహిరంగ లేఖ రాశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించడం అంటే చంద్రబాబును అధికారంలోకి తేవడమా..? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు పవన్ కళ్యాణ్ వెంట నడవడం లేదన్న ఆయన.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 45 నుంచి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని సూచించారు. అధికారంలోకొస్తే రెండున్నర ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని టిడిపి నేత చంద్రబాబు నాయుడు ప్రకటించాలని ఈ లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే జరిగే నష్టానికి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు హరిరామ జోగయ్య. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒక దామోదరం సంజీవయ్య మినహా ఇప్పటివరకు అగ్రవర్ణాల్లో ఆరు శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు నాలుగు శాతం ఉన్న కమ్మ కులస్తులు తప్ప 80% ఉన్న మిగిలిన బడుగు బలహీన వర్గాల వారెవ్వరూ ముఖ్యమంత్రి పదవులు అధిష్టించి పరిపాలన అధికారం చేపట్టిన వారు లేరన్నారు. ఆనాటి నుంచి 25% ఉన్న కాపు తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు బీసీ కులస్తులుగా గుర్తింపు పొందనుందకుండా విద్య ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్ సౌకర్యం పొందకుండా అడ్డుకుంటున్నారనేది వాస్తవం.