తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఈ తీర్మానంపై చర్చించనున్నారు. చర్చ జరిగిన అనంతరం నేటి సభ వాయిదా పడుతుంది. ఇక రేపు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈనెల 11వ తేదీన ఆదివారం కావడంతో ఆరోజు సభ కార్యకలాపాలకు బ్రేక్ ఉంటుంది.
తిరిగి ఈనెల 12వ తేదీన సభ ప్రారంభం అవుతుంది. 12, 13 రెండ్రోజుల్లో బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఈ రెండ్రోజులు చర్చకు సమయం సరిపోకపోతే స్పీకర్ ఈ సమావేశాలను పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభను కనీసం 12 రోజులైనా నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇక తొలి రోజున గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. కాళోజీ నారాయణరావు రచించిన ‘అధికారమున్నదని హద్దుపద్దు లేక.. అన్యాయమార్గాల నార్జింపబూనిన.. అచ్చి వచ్చే రోజులంతమైనాయి.. అచ్చి వచ్చే రోజులంతమైనాయి’తో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రముఖ తమిళకవి సుబ్రహ్మణ్య భారతి మాటలైన ‘విత్త నిర్వహణకు వివేక కాంతి పుంజం అవసరం’తో ముగించారు.