‘ఆయన్ను అవమానిస్తే సహించను’ .. ఖర్గేపై రాజ్యసభ ఛైర్మన్ ఫైర్‌

-

రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) అధినేత జయంత్‌ చౌధరి రాజ్యసభలో మాట్లాడుతుండగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్రంగా మండిపడ్డారు. భారత మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌కి కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించడంతో తన తాతను పురస్కారంతో గౌరవించిన కేంద్రానికి.. ఆయన మనవడు జయంత్‌ చౌధరి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాలు నేటితో ముగిసిన విషయం తెలిసిందే. చివరి సమావేశాల నేపథ్యంలో జయంత్‌ మాట్లాడుతుండగా మధ్యలో ఖర్గే అడ్డుకుని భారతరత్నతో నాయకులను సత్కరించడంపై ప్రస్తుతం చర్చ జరగడం లేదని అన్నారు.

జయంత్‌ మాట్లాడేందుకు ఏ నియమం ప్రకారం అనుమతి పొందారో తాను తెలుసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు. రూల్స్‌ అనేవి న్యాయబద్ధంగా ఉండాలని నచ్చినట్లు అమలు చేయడం కాదంటూ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేయడంతో జగదీప్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ‘‘మీరు చరణ్‌సింగ్‌ను అవమానించారు. ఆయన వారసత్వాన్ని కూడా అవహేళన చేశారు. ఆయన్ను అవమానిస్తే నేను సహించను. సభలో ఇలాంటి భాషను వినియోగించడం ఆమోదయోగ్యం కాదు. చరణ్‌సింగ్‌ కోసం మీవద్ద కాస్త సమయం కూడా లేదా. దేశంలోని ప్రతీ రైతును బాధ పెడుతున్నారు. ఈ చర్యతో మనమంతా సిగ్గుతో తల దించుకోవాలి’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news