ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ వైసీపీ తన మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చిన ఆ పార్టీ అధినేత జగన్… రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసి పేదలకు అండగా నవరత్నాల హామీలను కలిపి మేనిఫెస్టోను రూపొందించారు. అయితే రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్ వంచించారని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇస్తానని చెప్పిన జగన్… అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మాట మార్చి జనాల నెత్తిన నవరత్న తైలం రాశారని విమర్శించారు.
ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని చెప్పారని… కానీ, రాష్ట్రాన్ని ముంచేసిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. విధ్వంసంతో పాలనను ప్రారంభించిన వైసీపీ… ఆరు నెలలలో రాష్ట్రాన్ని సూసైడ్ ప్రదేశ్ గా మార్చిందని చెప్పారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.