తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల కోసం ప్రత్యేక పథకం ప్రారంభించింది. ప్రతి సింగరేణి ఉద్యోగికి రూ.కోటి ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ ఉద్యోగులు వేతనం నుంచి ఎలాంటి ప్రీమియం కట్టకుండా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేతన ఖాతా ద్వారానే ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. అయితే మరి కార్మికులకు ఈ బీమా ప్రయోజనాలు ఎలా అందుతాయో ఓసారి తెలుసుకుందామా?
- నెలకు జీతం ఎంత వస్తుందనే దాంతో సంబంధం లేకుండా ఉద్యోగులందరికీ నేరుగా రూ.కోటి ఉచిత ప్రమాద బీమా సదుపాయం ఉంటుంది.
- ప్రమాదంలో మరణం లేదా శాశ్వత పాక్షిక వైకల్యం, పూర్తి శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.కోటి పరిహారం అందుతుంది.
- వేతన ఖాతా ఉన్న యూనియన్ బ్యాంక్ డెబిట్ కార్డును నెలలో ఒక్కసారైనా వాడటం ద్వారా మరో రూ.15 లక్షల బీమా ప్రయోజనం కలుగుతుంది.
- అగ్ని ప్రమాదం జరిగి ప్లాస్టిక్ సర్జరీ వంటి చికిత్స అవసరమైన పక్షంలో రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది.
- ప్రమాదంలో ఉద్యోగి చనిపోతే, ఆ సమయానికి బాధితునికి డిగ్రీ చదివే పిల్లలు ఉంటే మరో రూ.6 లక్షల ఆర్థిక సాయం చేస్తారు.
- గాయపడిన ఉద్యోగులను వైద్యం కోసం అత్యవసరంగా ఆసుపత్రికి తరలించడానికి హెలికాప్టర్ వంటి ఎయిర్ అంబులెన్స్ సేవ అవసరమైన పక్షంలో మరో రూ.6 లక్షల ఆర్థిక సాయం అందుతుంది.
- ఏడాదిలో రూ.15 వేల వరకు ఇన్‌పేషెంట్ కవరేజ్ కల్పిస్తారు.
- ఉద్యోగి తీసుకునే గృహ, వాహన రుణాలు, విదేశీ విద్య కోసం ఉద్యోగి పిల్లలు తీసుకునే రుణాలపై ప్రత్యేక రాయితీ ఉంటుంది.
- ఉద్యోగి రిటైరైన తర్వాత పింఛను ఖాతాను యూనియన్ బ్యాంకులోనే కొనసాగిస్తే 70 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ బీమా సదుపాయం కల్పిస్తారు.