త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్ లో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ 2024 అవార్డుకు ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహిత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాను సీఎం అభినందించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘మూడు వందల ఎకరాల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తాం. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీంతో మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక గంట ప్రయాణ దూరంలోని అత్యంత సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సదుపాయంగా ఉంటుంది…’ అన్నారు.