అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టాడు…. దురదృష్టవంతుడు ఎవరు బాగు చేయలేరు అన్న నానుడి జగమెరిగినదే. ఈ నానుడి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా విషయంలో నూటికి నూరు శాతం వర్తిస్తుంది. దివంగత కాంగ్రెస్ నేత వంగవీటి మోహన రంగా రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధా కేవలం 25 సంవత్సరాలకే కాంగ్రెస్ నుంచి 2004 లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయంగా వేసిన వరుస రాంగ్ స్టెప్పులు నేపథ్యంలో రాధా కెరీర్ అగమ్య గోచరంగా మారింది. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీచేసి ఓడిన రాధా… 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి వరుసగా రెండోసారి ఓడిపోయారు.
ఇక ఈ ఎన్నికలకు ముందు వరకు వైసీపీలోనే ఉన్న రాధా జగన్‌తో తీవ్రంగా వివరించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టిడిపిలో చేరారు. తన కుటుంబానికి చిరకాల రాజకీయ శత్రువు అయిన టిడిపిలో రాధా చేరటం ఆ కుటుంబ అభిమానులకు ఎంత మాత్రం నచ్చలేదు. కేవలం సెంట్రల్ సీటు ఇవ్వలేదన్న కోపంతోనే రాధా వైసీపీని వీడారు. జగన్ తూర్పు, అవనిగడ్డ అసెంబ్లీ లేదా బందరు ఎంపీ సీటు ఇస్తానన్నా ఆయన మాత్రం వినలేదు.
ఇప్పుడు టీడీపీకి ఫ్యూచర్ లేకపోవడంతో రాధా రాజకీయంగా ఏం చేయాలో ? తెలియక సంధి కాలంలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే రాధాకు మంత్రి కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ అత్యంత సన్నిహితులు. వంశీ ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.ఈ విషయంలో కొడాలి నాని కీలక పాత్ర పోషించారన్నది తెలిసిందే. ఇప్పుడు వంగవీటిని సైతం వైసీపీలోకి తీసుకు వెళ్లేందుకు నాని ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్..?
ఇదే విషయమై నాని మాట్లాడుతూ రాధా తనకు మంచి మిత్రుడని, ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే తానే దగ్గరుండి జగన్ వద్దకు తీసుకెళ్తానని అన్నారు. రాధాను పార్టీలోకి తీసుకు వెళ్లేందుకు అటు కొడాలి నానితో పాటు జిల్లాకే చెందిన మరో మంత్రి పేర్ని నాని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి రాధా రీ పొలిటికల్ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో ? చూడాలి.