ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో పేర్నమిట్ట- లింగంగుంట గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా రాయితో కొట్టి చంపి.. ఆమె ఏడాది వయసు కుమార్తెను గొంతుకోసి చంపారు. అనంతరం పెట్రోల్ పోసి ఇద్దరి మృతదేహాలను కాల్చేశారు. అత్యంత కిరాతకమైన ఈ దారుణ సంఘటన మంగళవారం జరిగింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. మృతురాలి వయస్సు సుమారు పాతికేళ్లు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
అలాగే పాప వయస్సు ఏడాది..ఏడాదిన్నర మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోడ్డు పక్కన కాల్చిన స్థితిలో పడి ఉన్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే ఒంగోలు గ్రామీణ సీఐ పి.సుబ్బారావు, ఒంగోలు సీఐ ఎం.లక్ష్మణ్, మద్దిపాడు ఎస్సై ఖాదర్‌బాషా తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన మహిళ తల వెనుక రక్తస్రావం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పాపను గొంతు కోసి చంపినట్లుగా భావిస్తున్నారు.
అయితే మృతురాలు ఎవరన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు. ఆమె స్వస్థలం, వ్యక్తిగత వివరాలు తెలిస్తే గాని దర్యాప్తు ముందుకు సాగేలా కనబడటం లేదని పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఇక ఆ ప్రాంతంలోని కొంతమంది స్థానికుల ద్వారా వివరాలు కనుక్కునే ప్రయత్నమైతే మొదలు పెట్టారు. అలాగే రెండు గ్రామాలకు వెళ్లే రోడ్ల సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. మృతురాలు ఎవరన్నది తెలిస్తే హత్య ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.
క్లూస్‌టీం సంఘటన స్థలాన్ని అనువనువు పరీక్షిస్తోంది. ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. హత్యకు గురైన వారిలో ఏడాది పాప ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. అత్యాచారం చేసి మహిళను హతమార్చారా..? లేక కుటుంబ కలహాలే ఆమె హత్యకు దారితీశాయా.. లేక మరేదైనా కారణాలున్నాయా..? అంటూ వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.