గెలుపే లక్ష్యం…

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు వెల్లడించింది. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 25 వరకూ అవకాశం కల్పించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.

దీంతో ఏపీలో రాజకీయ పరిణామాలు తీవ్ర స్థాయిలో మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు ప్రకటించి.. ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. ప్రతిపక్ష నేతల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ.. అడుగులు ముందుకు వేస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లో వెళ్లేందుకు సిద్ధమైంది.

షెడ్యూల్ విడుదల అవ్వడంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఓ వైపు ప్రతిపక్ష పార్టీలు కూటమి కడితే.. మరోవైపు సింగిల్‌గా, పక్కా ప్రణాళికతో జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు వైసీపీ అధినేత‌ సీఎం జగన్‌. ఎన్నికలకు కౌంట్‌ డౌన్ మొదలవుతుండటంతో.. సీఎం జగన్ ఇక రంగంలోకి దిగేందుకు ఫిక్స్ అయ్యారు.

ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ సమీకరణాల నడుమున వైసిపి తరఫున ప్రచారంలో కొత్త పుంతలు తొక్కేలా జగన్ ప్రసంగం ఉండబోతోంది. ఎన్నికల క్యాంపైన్లో భాగంగా.. సీఎం జగన్ జిల్లాల పర్యటనలు చేయనున్నారు. దీంతో 2024 ఎన్నికల స్పీచ్ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే సిద్ధం సభల పేరుతో ప్రాంతాల వారీగా సభల్లో పాల్గొన్న ఆయన ఎన్నికల క్యాంపెయిన్ ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్లో జోష్ నింపిన ఆయన.. ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచి విపక్షాలపై విమర్శల డోస్ పెంచి దూసుకెళ్ళనున్నారు.

ఈ నేపథ్యంలో ఓకే రోజు వేరు వేరు ప్రాంతాల్లో వేర్వేరు సభలు నిర్వహించేలాగా ఏర్పాట్లు చేస్తుంది వైసీపీ. ఏపీలో కీలకమైన నియోజకవర్గాలను టచ్ చేస్తూనే ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ ప్రచారం ఉండేలాగా ప్లాన్ రూపొందిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి 151 నియోజకవర్గాల్లో విజయ బావుటా ఎగురవేసిన వైసీపీ.. ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచారంలో వై నాట్ 175 నినాదాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకొని వెళ్లబోతోంది.

తమ పర్యటనలో మ్యానిఫెస్టోను వైఎస్ జగన్ ప్రకటించే అవకాశం ఉంది. నాడు-నేడు పేరుతో సంక్షేమం, అభివృద్ధి అంశాలను ఇటీవల ప్రజల్లోకి తీసుకెళుతున్న వైసీపీ అధినేత.. అదే ఫార్ములాను మరోసారి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేలా స్పీచ్‎ను తయారు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి 2019 ఎన్నికల్లో తన స్పీచ్‎లతో ప్రజలకు చేరువైన జగన్.. ఈ ఎన్నికల ప్రచారంలో అంతే దూకుడుతో తన ప్రసంగాన్ని ఉండేలా చూసుకుంటున్నారు.

ఇక ప్రాంతాలవారీగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వెనుక బాటుతనం, ఉత్తరాంధ్రలో వలసలు, ఉద్దానం తాగునీటి సమస్యలు, మేనిఫెస్టో హామీల అమలు, సంక్షేమ పథకాలు, రైతాంగం, యువత మహిళల కోసం అమలు చేసిన సంస్కరణలను ప్రజలకు వివరించబోతున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ర్యాలీలతో ఎన్నికల ప్రచారం ఉధృతం చేయబోతోన్నటు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news