తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది.
రాష్ట్రవ్యాప్తంగా నిఘాను పెంచి రాష్ట్ర సరిహద్దులు మొదలు అన్ని జిల్లాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలింపు, నిల్వలపై నిఘా పెంచాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రకటనలను ఈరోజు సాయంత్రంలోగా తొలగించాలని స్పష్టం చేశారు.
ఎన్నికలను ప్రభావితం చేసేలా నగదు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వికాస్‌రాజ్ హెచ్చరించారు. పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, బైండోవర్ కేసుల ప్రక్రియా కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వ ప్రకటనలు తొలగించాలని ఎలాంటి అడ్హాక్ నియామకాలు చేపట్టకూడదని పేర్కొంది.