వాళ్లు గతంలో ఫ్రాన్స్‌లోనూ దాడులకు యత్నించారు.. మాస్కో ఉగ్రదాడిపై మెక్రాన్‌

-

రష్యా రాజధాని మాస్కోలో మారణ హోమానికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ దారుణానికి పాల్పడింది ఇస్లామిక్ స్టేటేనని చెప్పడానికి తమ వద్ద సమాచారం ఉందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ అన్నారు. ఈ ఘటనలో ఉక్రెయిన్‌పై నిందమోపేందుకు రష్యా యత్నించడం మూర్ఖపు చర్యే అవుతుందని పేర్కొన్నారు.

ఈ ఉగ్రమూక గతంలో ఫ్రాన్స్‌నూ లక్ష్యంగా చేసుకుందని మెక్రాన్ తెలిపారు. మాస్కో దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు ప్రకటించుకుందన్న మెక్రాన్.. తమ నిఘావర్గాలకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కూడా ఇదే విషయం వెల్లడవుతోందని అన్నారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఈ సందర్భాన్ని వాడుకోవడం రష్యాపై, దాని పౌరుల భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మాస్కో దాడికి బాధ్యత వహించిన ఉగ్రసంస్థ గతంలో ఫ్రాన్స్‌లోనూ దాడులకు యత్నించిందని వెల్లడించారు.

ఈ కాల్పులకు తామే తెగబడినట్లు అఫ్గాన్‌కు చెందిన ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు చెప్పినా.. పుతిన్‌ మాత్రం ఇప్పటివరకు ఈ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. మరోవైపు ఉగ్రదాడి చేసిన ముష్కరులు తమ నేరాన్ని కోర్టులో అంగీకరించారు. ఫలితంగా వారికి మే 22వరకు కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news