దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ నేతలు, ఇండియా కూటమి నేతలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ నాయకులు ఇప్పటికే ఆందోళనలు చేశారు. తాజాగా మరోసారి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇవాళ ఆప్ నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్షలో ఆప్ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దీక్ష సందర్భంగా దిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మద్దతుపలికే వారంతా ఈరోజు నిరాహారదీక్ష చేపడుతున్నారని తెలిపారు. ఎన్నికైన ప్రభుత్వాలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయా ప్రభుత్వాలను కూలదోసే వారితో పోరాటం ఆరంభమైందని అన్నారు. తాము భారత రాజ్యాంగాన్ని కాపాడతామన్న గోయల్.. కాషాయ పాలకులు ఆప్‌ను చీల్చాలని కోరుకుంటున్నా తాము మరింతగా బలపడతామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియులు అరవింద్ కేజ్రీవాల్‌కు బాసటగా నిలుస్తున్నారని అన్నారు.