త్వరలోనే లోక్సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే పలువురు దీన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఏఏ అమలుతో భారతీయులెవరూ తమ పౌరసత్వాన్ని కోల్పోరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఈ అంశంపై ప్రజల్లో అనవసర గందరగోళం సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నామక్కల్ నియోజకవర్గ అభ్యర్థి కేపీ రామలింగం చేపట్టిన ర్యాలీలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. రోడ్‌షో అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ… బిజెపి ప్రజలకు తాను ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. అయోధ్యలో రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ వంటి హామీలే దానికి ఉదాహరణ అని ఆయన గుర్తు చేశారు.సీఏఏ వల్ల ఇండియాలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, యూదులు.. ఇలా ఏ పౌరుడి పౌరసత్వమూ పోదని మేము హామీ ఇస్తున్నాము. మహిళలు అందరినీ మా తల్లి, చెల్లిగా భావిస్తాం అని అన్నారు. అందువల్లే ముస్లిం సోదరీమణులకు అన్యాయం జరగకుండా చూడాలని త్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేశాము.” అని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.