జేఈఈ (మెయిన్) పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్. దేశంలోని ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల షెడ్యూల్లో మార్పు చోటు చేసుకుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అడ్వాన్స్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
అయితే తాజాగా దాన్ని ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మార్పు చేశారు. ఈ విషయాన్ని ఐఐటీ- మద్రాస్ ప్రకటించింది. పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది. మే 26వ తేదీన యథాతథంగా పరీక్ష జరుగుతుందని పేర్కొంది. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్ష పేపర్ -1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; పేపర్ -2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నట్లు వెల్లడించింది.