సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మూడో దశ నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల 7వ తేదీన జరిగే ఈ విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం- (సీఈసీ) విడుదల చేసింది. మూడో దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాంత్రాల్లోని 94 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామ పత్రాల దాఖలుకు ఈ నెల 19వ తేదీ చివరి తేదీ అని ఈసీ తెలిపింది.
మూడో దశలో అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ ,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీ , దమణ్ దీవ్‌లోనూ పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో…ఆ లోక్‌సభ స్థానం ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి విడిగా మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. బేతుల్ నియోజకర్గంలో రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉంది. 18వ లోక్‌సభ ఎన్నికలకు ఏడు దశల్లో జరగనున్న పోలింగ్ ….ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభమై జూన్ 1వ తేదీన ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.