అటు అంతా స్టార్లు… మరి ఇటు ఎవరూ…?

-

ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ, అధినేత, పనితీరు చాలా ముఖ్యం. వీటన్నిటితో పాటు ప్రచారానిదే పెద్ద పీట. అందుకే ప్రతి ఎన్నికల్లో కూడా నేతలంతా ఓటర్లను ఆకట్టుకునేందుకు జోరుగా ప్రచారం చేస్తుంటారు. ప్రస్తుత ఏపీ ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే… అధికార, ప్రతిపక్షాలకు చావో రేవో అన్నట్లుగా మారిన ఎన్నికలు కూడా. అందుకే గతానికి భిన్నంగా ప్రతిపక్షాలు ఏకంగా రెండేళ్ల ముందు నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో టీడీపీ నేతలు ప్రచారం చేస్తుండగా… వారాహి యాత్రలో జనసేనని పవన్ కల్యాణ్ పర్యటించారు. అధికార వైసీపీ నేతలు కూడా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఏడాది పైగా ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు ప్రచారం చేస్తున్నారు. దీంతో దాదాపు ఏడాది ముందు నుంచే ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైందనే చెప్పాలి.

ఇక నోటిఫికేషన్ రాక ముందే అన్ని పార్టీలో తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో నియోజకవర్గాల్లో అసంతృప్త నేతల బుజ్జగింపులు, టికెట్ దక్కని నేతల పార్టీ ఫిరాయింపులు కూడా నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే నాటికి పూర్తయ్యిందనే చెప్పాలి. ఇక ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రచారం చేస్తుండగా… వారాహి సభలు పేరుతో పవన్ పర్యటిస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం మేమంతా సిద్ధం అంటూ వైఎస్ జగన్ కూడా బస్సు యాత్ర చేపట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం అంటూ చేపట్టిన బస్సు యాత్ర.. తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది.

కూటమి అభ్యర్థుల గెలుపు తరఫున స్టార్ క్యాంపెయినర్‌ల జాబితా పెద్దగానే ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, నాగబాబు, అమిత్ షా, జేపీ నడ్డా, నారా భువనేశ్వరి, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, ఆచంట సునీత, పృధ్వీ… ఇలా స్టార్ క్యాంపెయినర్ జాబితా చాలా పెద్దగానే ఉంది.

అదే సమయంలో వైసీపీలో మాత్రం కేవలం పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్న జగన్… వైసీపీకి ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన సామాన్యులే క్యాంపెయినర్లు అని గొప్పగా ప్రకటించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున వైఎస్ విజయమ్మ, షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం వారంతా ఎక్క అని నిలదీస్తున్నారు ప్రతిపక్ష నేతలు. మొత్తానికి ఈ ఎన్నికల్లో సింగల్ వర్సెస్ ఆల్ అన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news