తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 155 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 61 కోట్ల 11 లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. పోలీసులు, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలు వేర్వేరుగా 28 కోట్ల 92 లక్షల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వివిధ విభాగాలు 23 కోట్ల 87 లక్షల రూపాయల విలువైన 27 క్వింటాళ్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
“వివిధ ప్రాంతాల్లో 19 కోట్ల 16 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి, ఇతర ఆభరణాలతో పాటు… 22 కోట్ల 77 లక్షల రూపాయల విలువైన 12 లక్షల 35 వేల ల్యాప్ టాప్, కుక్కర్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు హైదరాబాద్ అబిడ్స్ ఎంజే మార్కెట్ కూడలిలో ఓ వ్యాపారి వద్ద 65 లక్షల నగదు పట్టుబడింది. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలను చూపకపోవడంతో అధికారులు నగదును సీజ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.” అని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.