కెసీఆర్‌కు క‌ష్టాలు అందుకేనా.. తెలంగాణ‌ ప్ర‌జ‌లు అంగీక‌రిస్తారా

-

తెలంగాణ కోస‌మే దేవుడు న‌న్ను పుట్టించాడు.. ప్లీజ్ న‌మ్మండి.. ఈ మాట‌లు అంటున్న‌ది ఎవ‌రో కాదు ఆ రాష్ట్ర మాజీముఖ్య‌మంత్రి,బీఆర్ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు. లోక్‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న స్థానిక వాదాన్ని మ‌ల్ళీ తెర‌మీద‌కు తీసుకువ‌స్తున్నారు.ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర కూడా చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని .. తాను తెలంగాణ కోసమే ఉంటానని అంటున్నారు.నిజంగా ఈ విషయంపై కేసీఆర్ కు ఇంతకు ముందే క్లారిటీ ఉండి ఉంటే ఇప్పుడు ఆయనకు ఇలా చెప్పుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదని ప‌లువురు తెలంగాణ‌వాదులు అంటున్నారు.

తెలంగాణ సాధ‌నే ల‌క్ష్యంగా రాజ‌కీయ పార్టీ పెట్టిన కేసీఆర్‌… సుదీర్ఘ పోరాటం త‌రువాత సొంత రాష్ట్రాన్ని రాబ‌ట్టుకున్నారు.ఆ వెంట‌నే జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపొంది ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. వ‌రుస‌గా రెండుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు.అయితే రెండోసారి సీఎం అయ్యాక థ‌ర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ దేశ‌మంతా తిరిగారు. తాన‌నుకున్న ఫ్రంట్‌కి మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేశారు.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమి జ‌రుగుతుందో ఊహించ‌లేము కాబ‌ట్టి కేసీఆర్ ప్లాన్ బెడిసికొట్టింది. గ‌త న‌వంబ‌రులో అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీ ఘోర‌ప‌రాభ‌వం చ‌విచూసింది. ఆ త‌రువాత సైలెంట్ అయిన ఈ గులాబీ నేత లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో బ‌స్ యాత్ర చేప‌ట్టిన ఆయ‌న తెలంగాణ‌వాదాన్ని బ‌లంగా వినిపిస్తున్నారు. తాను లేకుంటే అస‌లు వ‌చ్చేది కాద‌ని.. ప్ర‌త్యేక రాష్ట్రం సాధ‌న కోస‌మే దేవుడు త‌న‌ను పుట్టించాడ‌ని అంటున్నారు.

ఇప్పుడు మళ్లీ తాను తెలంగాణ కోసమే పుట్టానని ప్లీజ్ నమ్మండి అంటూ బ‌స్‌యాత్ర‌తో బయలుదేరారు. కేసీఆర్ బలం, బలగం తెలంగాణ అంటున్నారాయ‌న‌. సొంతంగా సామాజికవర్గ బలం లేని కెసీఆర్ తెలంగాణ అనే సెంటిమంట్ ను గట్టిగా ఒడిసి పట్టుకున్నారు. ఆంధ్రోళ్లను తిట్టో… మరో ఆశ చూపో.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టగలిగారు కానీ తాను అనుకున్నది సాధించలేక‌పోయారు. తెలంగాణ బాపు అంటూ ప్రచారం చేసుకున్న కెసీఆర్‌.. ఎప్పుడైతే తెలంగాణను కాదని దేశ రాజకీయాలకు పోతానని చెప్పడం ప్రారంభించారో అప్పుడే తెలంగాణలో ప్ర‌జ‌ల‌కు దూరం కావడం ప్రారంభించారు.

పార్టీ పేరును కూడా మార్చడంతో ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ తెగిపోయింది. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ సారి తెగిపోయిన దారాన్ని అతికించడం ఎంత కష్టమో.. ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ తెచ్చుకోవడం కూడా అంతే కష్టం. కేసీఆర్ ఇప్పుడిప్పుడే ఈ వాస్త‌వాన్ని గ్ర‌హించిన‌ట్టున్నారు. అందుకే మ‌ళ్ళీ తాను తెలంగాణ కోస‌మే పుట్టాన‌నే ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news