దక్షిణ భారత ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ శామ్ పిట్రోడా ఆ పదవికి రాజీనామా చేశారు. తాను ఆ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామాకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని, ఈశాన్య భారతంలో చైనీయులు మాదిరిగా ఉంటారని పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ప్రజాస్వామ్య ఔన్నత్యం గురించి చెబుతూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చsసింది. పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. శరీర రంగు చూపి ప్రజలను అవమానిస్తారా? అని మండిపడ్డారు. మరోవైపు పిట్రోడా వ్యాఖ్యలతో కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనే పదవి నుంచి తప్పుకున్నారు.