బెట్టింగ్‌లకు అలవాటుపడి రూ.2 కోట్లు డబ్బులు పోగొట్టుకున్న కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామానికి చెందిన ముకేశ్ కుమార్ (28) బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో భారీగా అప్పులు చేశారు. ఇవన్నీ మానుకోవాలని తండ్రి సత్యనారాయణ పలు మార్లు హెచ్చరించాడు. అయినా అతను పట్టించుకోకుండా బెట్టింగ్ పెట్టసాగాడు. ఇలా బెట్టింగ్‌లో ముకేశ్ ఇప్పటి వరకు రూ.2 కోట్లు పోగొట్టాడు. ఎన్ని సార్టు చెప్పినా మారకపోవడంతో శనివారం రాత్రి కుమారుడిపై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలై కుమారుడు మృతి చెందాడు. ముకేశ్ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్ కారణంగా అమ్మేశారని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.