పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్త మండలాలు, రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో ప్రజలు అనేక ఆందోళనలు కూడా నిర్వహించారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ హేతుబద్ధంగా లేదని గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అభ్యతరం వ్యక్తం చేసింది. అదేవిధంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం కొట్లాడిన ప్రముఖుల పేర్లు, చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాల పేర్లను జిల్లాలకు నామకరణం చేశారు. అదే వారికి అసలైన నివాళి అంటూ గులాబీ బాస్ అధికారికంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.
ఇందులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాకు గోండు వీరుడు కొమురం భీం పేరు, కొత్తగూడెం జిల్లాకు పుణ్యక్షేత్రం భద్రాచలం పేరును, భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరు, గద్వాల జిల్లాకు శక్తిపీఠం జోగులాంబ పేరు, భువనగిరి జిల్లాలకు పుణ్యక్షేత్రం యాదాద్రి పేర్లను పెట్టారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ తాజాగా, రెండు జిల్లాల పేర్లను కూడా మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అందులో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాకు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి సూచనాప్రాయంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో రెండు మారుబోతున్నాయనే విషయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.