నేటి రాజకీయాలలో చదువుకున్న వాళ్లకు కూడా వెలకట్టే పరిస్థితి వచ్చిందని బీజేపీ సీనియర్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాజాగా నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వరంగల్, ఏకశిలా నగర్‌లో యూత్ మీటింగ్‌లో పాల్గొన్నారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ మీ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. మనం ఎమ్మెల్యేలను, ఎంపీలను, కార్పొరేటర్లను ఎన్నుకుంటున్నాము. వాళ్లు సరిగ్గా పని చేస్తే మనకు సంతోషం. కానీ వారు డబ్బు మనుషులై ప్రజలను పీడిస్తే వీడికి ఎందుకు ఓటేశామురా అని బాధ పడతాం.
పట్టభద్రుల ఓట్లలో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఓటేసే ముందే వారి నిజాయితీని తెలుసుకోవాలి. రాష్ట్రభవిష్యత్తును, దేశ భవిష్యత్తును నిర్ణయించేది మన ఓటు హక్కేనని గుర్తించాలి. మీ అరచేతిలోని సెల్‌ఫోన్‌లో దేశంలో జరిగే ప్రతీ విషయం తెలుసుకుంటున్నారు. ప్రధాని మోదీ గురించి మీకే ఎక్కువ తెలుసు. కరోనా కాలంలో ఆయన ఇతర దేశాల నాయకులలాగ కన్నీళ్లు పెట్టకుండా ప్రజలకు ధైర్యం చెప్పి, వ్యాక్సిన్ ఇప్పించి కరోనా భయం లేకుండా చేసిన గొప్ప ప్రధాని. అయోధ్య రామమందిరాన్ని ప్రపంచం మెచ్చుకునే రీతిలో వైభవంగా కట్టించారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు 12 కోట్ల టాయిలెట్లు కట్టించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారు. 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించి సొంతింటి కల నెరవేర్చారు.
ప్రధాని మోదీ ప్రపంచంలోనే గొప్ప నాయకునిగా కీర్తించబడుతున్నారు. దేశంలో బాంబులు పేలకుండా ఉండాలంటే, దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే మోదీ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు 40 ఏళ్లుగా పార్టీని, ప్రజలను నమ్ముకుని సేవ చేస్తున్నారు వారిని గెలిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు ఈటల రాజేందర్.