తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పెషల్ ట్వీట్ చేశారు. భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. 1947లో తెలంగాణ మినహా దేశమంతటికీ స్వతంత్రం సిద్దించిందని తెలిపారు. స్వాతంత్రం కోసం తెలంగాణ మరో రెండేళ్లు వేచిచూడవలసి వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం 60 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సకల జనుల కల సాకరమై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుడే దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తపోరాటాలకు పురిటి గడ్డ అయిన తెలంగాణ నాలో పోరాట స్పూర్తి నింపిందని స్పష్టం చేశారు.
ఇక్కడ గాలిలో.. నేలలో.. మాటలో చివరకు పాటలో సైతం పోరాట పటిమ తొణికిసలాడిందని కొనియాడారు. నీళ్లు-నిధులు-నియామకాలు అనే నినాదంతో సకల జనులు సాగించిన ఉద్యమాన్ని పాలకుల సదా గుర్తెరగాలని హితవు పలికారు. ప్రజలందరికీ తెలంగాణ ఫలాలు సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా అందాలని కాంక్షించారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రపథంలో పాలకులు నిలపాలని కోరుకున్నారు. ప్రజా తెలంగాణను సంపూర్ణంగా ఆవిష్కరింపజేయాలన్నారు. అప్పుడే ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరవీరులకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ దశాబ్ద వేడుల సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.