జూన్ 4వ తేదీ నాటి ప్రజాతీర్పు కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎన్డీఏదే మరోసారి అధికారం అని దాదాపు అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. సీట్ల సంఖ్యలో అంచనాలు వేరుగా ఉన్నా మరోసారి ప్రధాని మోదీనే అధికార పగ్గాలు చేపడతారని తేల్చిచెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసుకుంటే ఎన్డీఏ కూటమికి కనిష్ఠంగా 242 సీట్లు, గరిష్ఠంగా 392 సీట్లు వస్తాయని వివిధ సర్వే సంస్థలు అంచనా వేశాయి.
ఈ నేపథ్యంలో మూడోసారి అధికారం చేపడితే తొలి 100 రోజులకు సంబంధించిన పాలనాపరమైన అంశాలతో పాటు పలు కీలక సమావేశాలను ప్రధాని మోదీ ఇవాళ నిర్వహిస్తున్నారు. మొత్తం 7 సమావేశాలను ప్రధాని ఇవాళ నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మళ్లీ కేంద్రంలో ఎన్డీయేదే అధికారమని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ అంచనావేసిన వేళ.. మోదీ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. రెమాల్ తుపాను ప్రభావం, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులకు సంబంధించిన అంశాలు ఇవాళ్టి సమావేశాల్లో మోదీ చర్చిస్తారు. వాటితోపాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో వడగాలుల తీవ్రతకు సంబంధించి ఒక సమావేశం, జూన్ 5న జరిగే అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం నిర్వహణకు సంబంధించి మరో సమావేశానికి ప్రధాని హాజరవుతారు.