పుష్ప మూవీ తరహాలో పనస పళ్ళ చాటున బొలోరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమహేంద్రవరం నుండి తెలంగాణలోని కరీంనగర్ వైపు ఓ బొలేరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో వాహనాల తనిఖీ చేపట్టారు శామీర్ పేట్ పోలీసులు. ఈ క్రమంలో ఓ బొలేరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పోలీసులు ఆశ్చర్యపోయారు. పనసపళ్ళ లోడుతో గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు.
గంజాయి తరలిస్తున్న ఈ బొలేరో వాహనాన్ని అనుసరిస్తున్న మరో కారుతో పాటు 35 కిలోలకు పైగా గంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గేదెల సతీష్ , కోరాడ సాయి, బండారు శివకుమార్ లను పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుండి తప్పించుకున్న శివ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారుగా రూ. 8 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు .పోలీసుల విచారణలో ఏ1,ఏ2గా ఉన్న సతీష్, సాయిలను ఇద్దరు పాత నేరస్థులుగా పోలీసులు గుర్తించారు. నిందితులను రిమాండుకు తరలించి దర్యా నమోదుప్తు చేస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ పేర్కొన్నారు.