‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసేది నేనే అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తేల్చి చెప్పారు. పోటీ నుంచి వైదొలగాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. గతవారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌తో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గెలుపుపై స్వపక్షంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ని తప్పించాలని కొన్నివర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తుండగా తాజాగా బైడెన్ వాటిపై స్పందించారు.
‘‘అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమోక్రాటిక్ పార్టీ నామినీని నేనే. నన్నెవరూ తప్పుకోమనడం లేదు. నేనే పోటీ నుంచి వైదొలగడం లేదు. తుదివరకు పోరాడతా. మనమే గెలవబోతున్నాం. జీవితంలో నేను చాలాసార్లు కింద పడ్డాను. పైకి లేచి పోరాడాను. ఎన్నిసార్లు పడిపోయావన్నది కాదు.. ఎంత వేగంగా కోలుకున్నావనేదే ముఖ్యమని మా నాన్న చెబుతుండేవారు. అమెరికా సైతం వెనకబడిన ప్రతిసారీ బలంగా పుంజుకొని తానేంటో నిరూపించుకుంది. నేనూ అదే చేయబోతున్నాను. దానికి మీ మద్దతు కావాలి’’ అని మద్దతుదారులకు రాసిన లేఖలో బైడెన్ పేర్కొన్నారు.