తెలంగాణలో వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పలువురు ఐఏఎస్ లనుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వివరణ కోరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు పంపుహౌసులపై విచారణ నిర్వహిస్తున్న కమిషన్ మొత్తం 10 మందికి నోటీసులు పంపంచింది. వీరిలో పలువురు రిటైర్డ్ ఐఏఎస్‌లు ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీటిపారుదల, ఆర్థిక శాఖలలో కీలక విధులు నిర్వహించిన వారు సోమ, మంగళవారాల్లో హాజరు కావాలని సమాచారం అందించింది.
దీనిపై స్పందించిన ఐఏఎస్ లు కమిషన్ విచారణకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. అయితే వారు చెప్పిన వివరాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని పీసీ ఘోష్ కమిషన్ కోరింది. అఫిడవిట్‌కు వారం రోజుల గడువు ఇచ్చింది. బడ్జెట్ సెషన్స్ కారణంగా ఆ తర్వాత అఫిడవిట్ సమర్పిస్తానని ప్రస్తుత ఫైనాన్షియల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తెలుపగా.. ఆగస్టు 5 వరకు గడువిచ్చించి కమిషన్.
ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇటీవల వరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసి రిలీవ్ అయిన వికాస్‌రాజ్‌లు విచారణకు హాజరుకానున్నారు. పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌లలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రజత్‌కుమార్, ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన నాగిరెడ్డిలను కూడా పిలిచింది. ఎన్నికల అధికారిగా పనిచేసిన వికాస్‌రాజ్ గతంలో కొంతకాలం నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.