అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరును ఆమోదించారు. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి సమ్మతించారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్‌గా జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. నవంబరులో జరగబోయే ఎన్నికకు పార్టీ తరఫున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లయింది.
ఎంతో ఆలోచించి, అందరి యోగ్యతలను మదించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మెరైన్ విభాగంలో అమెరికాకు ఆయన సేవలందించారని .. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన యేల్ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడని వెల్లడించారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్త అని సోషల్ మీడియాలో ట్రంప్ రాసుకొచ్చారు. 2022లో మొదటి సారిగా అమెరికా సెనేట్‌కు జేడీ వాన్స్ ఎన్నికయ్యారు. భారత సంతతి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉషా చిలుకూరిని వాన్స్ వివాహమాడారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్ పై ఆదివారం రోజున దాడి జరిగిన విషయం తెలిసిందే.