రాపిడో డ్రైవర్లు, రేలింగ్ పనుల ముసుగులో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న నలుగురిని హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ లోని బార్మార్‌కు చెందిన రమేష్ కుమార్, మహదేవ్ రామ్ మరో ఇద్దరితో కలిసి 2022లో హైదరాబాద్‌కు వలస వచ్చి ఇక్కడ రాపిడో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అయితే ర్యాపిడో ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో డ్రగ్స్ దందా చేయాలని భావించారు. రాజస్థాన్‌కు చెందిన దినేష్ కల్యాణ్ నుంచి 6 వేల రూపాయలకు ఒక గ్రాము హెరాయిన్ చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లో 12 వేలకు విక్రయిస్తున్నారు.
ఇటీవల మహదేవ్ రాజస్థాన్ వెళ్లి 30 గ్రాముల హెరాయిన్‌ను నగరానికి తీసుకొచ్చి ఒక్కో ప్యాకెట్‌లో 2 గ్రాముల చొప్పున ఉంచి విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సరూర్ నగర్‌లో నిందితులు తచ్చాడుతుండగా పోలీసులు వారిని పట్టుకుని 34 గ్రాముల హెరాయిన్, ద్విచక్రవాహనం రెండు చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో హెరాయిన్‌ను విక్రయిస్తున్న ఒకరిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు కేసుల్లో నిందితులు కొన్ని నెలలుగా హెరాయిన్ విక్రయించే దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.