పదికి పది గెలిచాం, అయినా ఏం లాభం..! శ్రీకాకుళం జిల్లా టీడీపీలో నైరాశ్యం

-

శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది.టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడ పసుపు జెండా రెపరేపలు చూస్తూనే ఉన్నాం. 2004 వైఎస్సార్ వేవ్ లో అలాగే 2019 వైసీపీ వేవ్లో కూడా ఆక్కడ టీడీపీ నేతలు సత్తా చాటి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక కేంద్రమంత్రి పదవితో పాటు రాష్ట్ర మంత్రి పదవి కూడా ఈ జిల్లాకు దక్కింది. అయినా శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ శ్రేణుల్లో ఎప్పుడూ లేని నిరాశ ఈసారి కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం ఎందుకు అర్థం చేసుకోలేకపోతోందని ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు సైతం ఆవేదన చెందుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు కావస్తున్నా అనుకూలమైన అధికారులను నియోజకవర్గానికి తెచ్చుకోలేకపోయామని ఎమ్మెల్యేలతో సహా కేడర్ నిట్టూరుస్తోంది.

జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో మాత్రం అధికారులకు స్థానచలనం కలిగింది. వైసీపీకి అనుకూలంగా పనిచేసిన యంత్రాంగాన్ని మార్చేశారు. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం అధికారులు అలాగే ఉన్నారు. జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత తనకు తెలియకుండా ఎలాంటి మార్పులు చేయొద్దని ఆదేశించడమే దీనికి కారణమట. దీంతో ఎమ్మెల్యేలు సైతం నిరాశకు గురవుతున్నారు. అధికారం వచ్చినా, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే కొనసాగడం వల్ల చిన్నచిన్న ఇబ్బందులను సైతం అధిగమించలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. కలెక్టర్లు, ఎస్పీలను మినహా ఏపీలో ఎక్కడా బదిలీలు జరగలేదు. దీంతో ఇంకా ప్రత్యర్థుల మాటే చెల్లుబాటు అవుతోందని అంటున్నారు. మండలాలు, సర్కిల్స్‌లో పోలీసుతోపాటు రెవెన్యూ, హౌసింగ్‌, మండల పరిషత్‌ అధికారులను మార్చాల్సిందిగా ఎమ్మెల్యేలపై ద్వితీయ శ్రేణి నాయకులు ఒత్తిడి చేస్తున్నారు.

డీఎస్పీ, ఆర్డీవో స్థాయి అధికారులను మార్చిన తర్వాత మండలస్థాయి అధికారుల మార్పు ఉంటుందని చెబుతున్నారు. వైసీపీ హయాంలో పలువురు సీఐలు, ఎస్సై లు టీడీపీ కేడర్ ను ఇబ్బందులకు గురిచేశారు. అరెస్టులు చేయడమే కాకుండా లాఠీలతో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వారి వద్దకు వెళ్లి పనులు చేయించుకోలేక నాయకులు సతమతమవుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని బదిలీపై పంపడం ఆలస్యం అవుతుండటం వల్ల ఇప్పటికీ ప్రత్యర్థుల మాటే చెల్లుబాటు అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు జరిగే వరకు ఓపిక పట్టాల్సిందిగా అటు అధిష్టానం సైతం కేడర్ కి సూచనలు ఇచ్చినా నేతల్లో నిరాశ కొనసాగుతోంది. చంద్రబాబు వస్తే బదిలీలు ఆలస్యంగా ఉంటాయని అపోహ ఉంది. దానిని తొలగిస్తూ ఇప్పటికైనా బదిలీలు షురూ చేయాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news