తెలంగాణ రైతులు ఎప్పుడు ఎప్పుడు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి రుణమాఫీ అమలు ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి విడుతలో రూ.1లక్ష వరకు రుణాలు ఉన్న రైతుల అకౌంట్లలో నగదును జమ చేసింది. ఇచ్చినటువంటి హామీ మేరకు ఆగస్టు 15లోపు 2లక్షల మేరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
రుణమాఫీ తరువాత ఇప్పుడు అందరి దృష్టి రైతు భరోసా పైనే పడింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుబంధు పథకం కింద ఇచ్చేటువంటి రూ.10వేల పెట్టుబడి సాయాన్ని రూ.15వేలకు పెంచి రైతు భరోస పేరుతో ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగా ఇంతవరకు అమలు కాలేదు. ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. మార్గదర్శకాలు ఎలా ఉండాలనేది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రెండు సభల్లో చర్చించనున్నట్టు తెలిపారు. అందరి సభ్యుల అభిప్రాయం తీసుకొని.. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.