ఎమ్మెల్యే దానం బూతుపురాణం.. తెలంగాణ అసెంబ్లీలో వింత ప‌రిణామం

-

తెలంగాణలో ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా బీఆర్ఎస్ స‌భ్యుల ప‌ట్ల అనుచిత ప‌ద‌జాలంతో రెచ్చిపోయారు. వ‌ర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం హాట్‌ హాట్‌గా జ‌రిగినా చివ‌రికి ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ హైలెట్ అయ్యారు. హైలెట్ అన‌డం కంటే సంస్కారం లేద‌ని ఎమ్మెల్యే నిరూపించుకున్నారు.

ప్ర‌జాప్ర‌తినిథిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన దానం నాగేంద‌ర్ తాజా వ్య‌వ‌హారంపై ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌లు సైతం వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసి వ్య‌క్తిగ‌తంగా దూష‌ణ‌లు చేసుకోవ‌డం ఏంట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. చ‌ట్ట‌స‌భ‌ల‌లో ఇలాంటి సంఘ‌ట‌న‌లు పునార‌వృతం కాకుండా చూడాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో సీంఎతోపాటు డిప్యూటీ సీఎం, మంత్రులు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాల ఎండ‌గ‌ట్టారు. అటు గులాబి పార్టీ ఎమ్మెల్యేలు కూడా ధీటుగానే జ‌వాబిచ్చారు. అక్కా త‌మ్ముడు, అన్నాచెల్లెలు వంటి సెంటిమెంట్లు కూడా బాగా పండాయి. కొన్నిసార్లు ఈ విమ‌ర్శ‌లు ప‌రిధి దాటిపోయాయి. చ‌ట్ట‌స‌భ‌ల్లో ఊహించ‌రాని పదాలతో కొంద‌రు రెచ్చిపోయారు. సీఎంను చీప్‌ మినిస్టర్‌ అని విప‌క్ష నేత‌లు వ్యాఖ్యానించగా, మంత్రులు వాటిని స‌మ‌ర్ధంవంతంగా తిప్పికొట్టారు. కేటీఆర్‌, హరీశ్‌రావుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.

ఇదంతా ఒక ఎత్త‌యితే చివరి రోజు జరిగిన సమావేశాల్లో దానం నాగేంద్ వాడిన ప‌ద‌జాలం ప‌ట్ల అన్ని వ‌ర్గా నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ స‌భ్యుల‌పై రెచ్చిపోయారు. బీఆర్ఎస్ స‌భ్యులు దీనిని తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ప్ర‌సంగం కొన‌సాగ‌డంతో ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దానంకు సభలో మాట్లాడే అర్హత లేదంటూ ఆందోళన చేశారు. దీంతో సహనం కోల్పోయిన దానం నాగేందర్.. నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. సభలో వాడకూడని పదాలతో విపక్ష సభ్యులను ధూషించారు. ఈ ప‌రిణామం తీవ్ర దుమారానికి దారితీసింది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను దూషిస్తున్న నాగేందర్‌ను సభాపతి గడ్డం ప్రసాద్‌ వారించే ప్రయత్నం చేసినా దానం లెక్క‌చేయ‌లేదు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలను కూడా ఆగాలని సైగ చేశారు స్పీక‌ర్‌. దానం నాగేందర్ వాడిన పదాలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు స్పీకర్‌కు చిట్టీలు పంపించారు. అప్పుడు కానీ.. పరిస్థితి అర్థం చేసుకున్న స్పీకర్.. దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎమ్మెల్యే దానం అన్ పార్లమెంటరీ పదాలు వాడి ఉంటే.. రికార్డులను పరిశీలించి తొలిగిస్తామని తెలిపారు. అయితే దానం మాత్రం దీనిని స‌మ‌ర్ధించుకున్నారు. కామ‌న్‌గా మాట్లాడే భాష‌నే తాను వాడాన‌ని అందులో త‌ప్పేముందని చెప్పుకొచ్చారు. దీనిని అటు ఎంఐఎం స‌భ్యులు కూడా ఖండించారు. త‌క్ష‌ణ‌మే స‌భ‌కు దానం క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత‌లు మాత్రం ఈ విష‌యంపై పెద్ద‌గా స్పందించ‌క‌పోవ‌డం శోచ‌నీయం.

Read more RELATED
Recommended to you

Latest news