సుప్రీంకోర్టులో ఇవాళ మరో అరుదైన సంఘటన చోటుచేసుకోనుంది. నిత్యం కేసుల పరిష్కారం, విచారణలతో బిజీగా ఉండే న్యాయమూర్తులు, లాయర్లు ఇవాళ సరదాగా సినిమా చూడనున్నారు. బాలీవుడ్ మూవీ ‘లాపతా లేడీస్’ను ఇవాళ సుప్రీంకోర్టులో ప్రదర్శించనున్నారు. ఈ సినిమాను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి చూడనున్నారు..
సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం ఈ సినిమా స్క్రీనింగ్ ఉండనుంది. సాయంత్రం 4.15 గంటల నుంచి 6.20 గంటల వరకు అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని సి-బ్లాక్‌లో గల ఆడిటోరియంలో ‘లాపతా లేడీస్’ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ స్క్రీనింగ్‌కు ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్, దర్శకురాలు కిరణ్ రావ్ కూడా రానున్నట్లు సమాచారం. కిరణ్‌రావ్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై తెరకెక్కించిన సినిమానే ‘లాపతా లేడీస్ మూవీ ఈ ఏడాది మార్చిలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.