గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం వినాయకుడి నిమజ్జనం కొనసాగుతున్నందున ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ నిబంధలను కఠినంగా అమలు చేస్తున్నారు.నగరంలోని అన్ని దారుల నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాటిని క్లోజ్ చేశారు.కేవలం గణనాధులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఇతర ప్యాసింజర్ వాహనాలను వేరే మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో నగరం ఎంట్రీ నుంచి ట్యాంక్ బండ్ దారులు మూసుకుని పోవడంతో చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.
ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌లో నేటి ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. గణపతి నిమజ్జనం, శోభాయాత్రల, పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఈరోజు ఆఫీసులు, పాఠశాలలకు సెలవు ప్రకటించినా వాహనదారులు రోడ్డెక్కడంతో ఇక్కట్లు తప్పడం లేదు. నిమజ్జనం ప్రక్రియ పూర్తయ్యే అంతవరకు నగరంలో ఇదే పరిస్థితి నెలకొననుంది.