కూకట్ పల్లిలోని వెంకట్రావు నగర్, శేషాద్రి నగర్ లో హైడ్రా కూల్చివేతలను పరిశీలించారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నల్ల చెరువులో కూల్చివేతల దుర్మార్గాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కన్నీళ్ళలో కొట్టుకుపోతుందని హెచ్చరించారు. చెరువులు కాపాడాలి.. కానీ పేదల కళ్ళలో మట్టి కొట్టే పద్దతి మంచిది కాదన్నారు. బుల్డోజర్లతో షెడ్లను కూల్చివేస్తూ.. కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కేవలం పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం హీనంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ఈటల రాజేందర్. చెరువులను కాపాడాలంటే.. ముందు ప్రభుత్వ, ప్రైవేటు భూములను లెక్కించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ భూములకు పరిహారం చెల్లించి.. చెరువులను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు ఈటల. కూల్చివేతలతో రోడ్డున పడ్డ పేదలకు తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలున్నాయని.. అవి బయటపడకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు.