జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేశాడు. అయితే రెండు స్థానాల్లో విజయం సాధించాడు. ఆయన విజయం సాధించిన బుద్గాం, గండర్ బాల్ స్థానాల్లో ఒక స్థానాన్ని వదులుకోవాలి. దీంతో ఆయన బుద్గాం అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో త్వరలోనే అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈనెల 16నే ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడింది. గందర్ బల్ నుంచి 10,574 ఓట్ల మెజార్టీతో.. బుద్గాం నుంచి 18,485 ఓట్ల ఆదిక్యంలో ఒమర్ అబ్దుల్లా విజయం సాధించారు. దీంతో ఒమర్ అబ్దుల్లా గందర్ బాల్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకున్నట్టు జమ్మూకాశ్మీర్ ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్ సభలో ప్రకటించారు. ఆయన 2009 నుంచి 2014 వరకు సీఎం గా ఉన్న సమయంలో గందర్ బల్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. బుద్గాంను వదులుకోవడంతో 95 మంది సభ్యుల సభలో నేషనల్ కాన్ఫరెన్స్ బలం 41కి తగ్గింది. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 5గురు స్వతంత్రులు, ఒకరు ఆప్, సీపీఐకి చెందిన మరొకరు మద్దతు తెలుపుతుండటం విశేషం.