తెలుగు రాష్ట్రాల ప్రజలు మద్యం విక్రయంలో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంటే.. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2 స్థానంలో ఉంది. తెలంగాణలో మద్యం పై ధరలు పెంచుతారని వార్తలు వినిపిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ధరల స్థిరీకరణ పై మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా మద్యం ధరల స్థిరీకరణకు త్వరలోనే టెండర్ కమిటీ వేస్తామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
డిస్టలరీస్ తో టెండర్ కమిటీ సంప్రదింపులు జరిపి ఎంఆర్పీ రేట్లు నిర్ణయిస్తున్నారు. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇప్పటికే క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అత్యంత పారదర్శకంగా దుకాణాలు కేటాయించి మద్యం విక్రయాలు ప్రారంభించామన్నారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు వారం రోజుల్లో 340 మద్యం దుకాణాల కేటాయింపునకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నవంబర్ 15లోపు దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.