కూటమి ప్రభుత్వంలో 5 నెలల్లో 91 అత్యాచార ఘటనలు జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. తాజాగా ఆయన తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. 5 నెలల కాలంలోనే మహిళలు, చిన్నారులపై 91కి పైగా అత్యాచారాలు జరిగాయని తెలిపారు. ఈ పనులు టీడీపీ కార్యకర్తలే చేస్తున్నా ప్రభుత్వం వారికే మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం అయిన హిందూపురంలో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేపు జరిగితే పోలీసులు మూడు రోజులు కాలయాపన చేశారని దుయ్యబట్టారు. ఇలాంటి ఘటన జరిగితే ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. అనకాపల్లి జిల్లా రామపల్లి మండలంలో కొప్పుగుండు పాలెంలో 9వ తరగతి బాలికను ప్రేమోన్మాది నరికి చంపేసాడు. తనను వేధిస్తున్నాడని గతంలో ఆ అమ్మాయి కేసు పెడితే అరెస్ట్ అయి జైలుకు వెల్లి వచ్చి తరువాత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రెడ్ బుక్ పాలనలో మునిగిపోయిన పోలీసులు కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అన్నారు. హోంమంత్రి పక్క నియోజకవర్గం అయినా కనీసం పరామర్శించడానికి కూడా రాలేదన్నారు జగన్.