తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, వైఎస్ జగన్ భేటీ ముగిసింది. సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ కి వచ్చిన ఏపీ సిఎం వైఎస్ జగన్. ఏకాంతంగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు ఆరు గంటల సేపు భేటీ జరిగింది. సుదీర్గంగా జరిగిన ఈ భేటీలో ఇరువురు ముఖ్యమంత్రులు పలు కీలక విషయాల మీద చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా కేంద్రం విషయంలో ఏ విధమైన వైఖరిని అవలంభించాలి అనే దానిపై జగన్, కెసిఆర్ సలహా కోరడంతో పాటుగా విభజన చట్టంలోని ఆస్తుల పంపకంకి సంబంధించి కూడా కీలక చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే వారు ఎం చర్చించారు అనేది స్పష్టంగా తెలియకపోయినా, జలవనరులు, ఆర్ధిక పరిస్థితి, మూడు రాజధానుల విషయంలో ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలి.
భేటీ ముగిసిన వెంటనే మీడియా సమావేశం లేకుండానే జగన్ విజయవాడ బయల్దేరి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక ఈ భేటీలో పౌరసత్వ సవరణ చట్టం కి సంబంధించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగిందని అంటున్నారు. అలాగే జనసేన ప్రస్తావన కూడా వీరి మధ్య వచ్చిందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. బిజెపి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో బలపడాలి అనుకోవడం దానిని ఏ విధంగా కట్టడి చెయ్యాలి అనే దానిపై ఇరువురు చర్చి౦చినట్టు తెలుస్తుంది