ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ స్టేషన్ నుండి వాహనం మాయం అయిన ఘటన ఇప్పుడు చర్చకు ధరి తీస్తుంది. అయితే మైలవరం మండలం వెల్వడం గ్రామం నుండి హైదరాబాద్ కు మార్చి నెలలో ట్రాన్స్పోర్ట్ లారీ ద్వారా ఇటుకలు రవాణా చేసాడు ఇటుక బట్టీ యజమాని. కానీ డెలివరీ చేయకుండా ఇటుకలను బయట అమ్ముకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు లారీ డ్రైవర్. జూలై నెలలో మైలవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన మైలవరం పోలీసులు.. డ్రైవర్ దొరక్కపోవడంతో అక్టోబర్ 6వతేదీన లారీని తీసుకొచ్చారు.
అయితే జీపీఎస్ ద్వారా నవంబర్ 8 వరకు మైలవరం పోలీస్ స్టేషన్ వద్దనే లారీ ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఆరోపిస్తున్నారు అడ్వకేట్ శ్రీనివాస్. లారీ మైలవరం పోలీస్ స్టేషన్ వద్ద పార్క్ చేసినపుడు ఫోటోలు తీసుకున్నాడు లారీ ఓనర్. ఇటుకలు అక్రమంగా అమ్మకానికి గురైతే లారీ తీసుకురావడం సరైన పని కాదని ఆరోపిస్తున్నాడు బాధితుడి తరపు లాయర్ శ్రీనివాస్. ఇదే విషయాన్ని పోలీసుల వద్దకు వెళ్ళి వివరించి, సరైనపవి కాదని సెర్చ్ వారెంట్ వేస్తామని చెప్పినమీదట పోలీసులు లారీని మాయం చేశారంటూ అభియోగం వేస్తున్నారు. లారీ ఓనర్ లారీ ఇవ్వమని అడిగితే ముద్దాయిని అప్పజెప్తేనే లారీ ఇస్తామంటూ ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నాడు అడ్వకేట్ ఓర్సు శ్రీనివాస్. అడ్వకేట్ ఆరోపణలతో మైలవరం పోలీసుల తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.