రోజూ ఒంటి మీద వేసుకునే బట్టల్ని తెల్లారి స్నానం చేసిన తర్వాత ఉతుక్కునే అలవాటు అందరికీ ఉంటుంది. అయితే పక్క బట్టల్ని డైలీ ఎవ్వరూ ఉతకరు. రాత్రంతా బ్లాంకెట్ లోనే నిద్రపోతాం, రగ్గుని నిండా కప్పుకుంటాం. మరి వాటిని ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలనేది చాలామందికి తెలియదు.
బ్లాంకెట్ ని, రగ్గుని రోజూ వాడతాం కాబట్టి దానిలో చెమట ఇంకా మన శరీరం నుంచి వచ్చే నూనెలు చేరిపోతాయి. దానివల్ల అప్పుడప్పుడు వాటిని కచ్చితంగా ఉతకాలి.
ముఖ్యంగా ఆస్తమా వంటి ఎలర్జీలు ఉన్నవారు పడుకునే బట్టల్ని క్రమం తప్పకుండా ఉతకాలి. నెలలు నెలలు వాటిల్లోనే పడుకోకూడదు. వారం నుంచి పది రోజుల లోపల కచ్చితంగా పక్క బట్టల్ని ఉతకాలి.
మీ ఇంట్లో పిల్లలు ఉన్నా, లేదంటే పెంపుడు జంతువులు ఉన్నా.. రగ్గుల్ని, బ్లాంకెట్లని చాలా తొందరగా ఉతకాల్సి ఉంటుంది. పిల్లలు బయట దుమ్ములో ఆడి వస్తారు కాబట్టి దుమ్ము ధూళి బ్లాంకెట్ కి అంటుకుని అనవసరమైన అలర్జీలను తీసుకువచ్చే ప్రమాదం ఉంది. అలాగే పెంపుడు జంతువులను పెంచుకునే వారు కూడా ఇలాంటి ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా వారం రోజులకు ఒకసారి కచ్చితంగా ఉతకాలి.
ఎలర్జీలు ఏమీ లేకపోతే అలాగే ఇంట్లో పిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ లేనట్లయితే.. రోజు వాడే బ్లాంకెట్ ని నెలకు రెండుసార్లు ఉతుక్కోవాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత చాలా అవసరం. కాబట్టి పడుకునే బట్టలను శుభ్రంగా ఉంచుకోవడం అస్సలు మరచిపోవద్దు.