ప్రస్తుత కాలంలో ఊబకాయం అనేది అందరినీ వేధిస్తున్న సమస్య. శరీర బరువును తగ్గించుకోవడానికి ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. దానికోసం రకరకాల వ్యాయామాలు, రకరకాల డైట్ లు పాటిస్తున్నారు. ప్రస్తుతం డైట్ లో భాగంగా శరీర బరువును తగ్గించేందుకు ఎలాంటి పండ్లు సహాయం చేస్తాయో తెలుసుకుందాం.
జామ పండు:
జామ పండులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతీ 100 గ్రాముల జామలో 68 క్యాలరీలు ఉంటాయి. ఇందులోని ఫైబర్ కారణంగా.. కడుపు నిండుగా మారిపోయి ఎక్కువగా తినకుండా ఉంటారు.
పుచ్చకాయ:
దీనిలో 90 శాతం నీరు ఉంటుంది. విటమిన్ ఎ, సి, పొటాషియం ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని లంచ్ కన్నా ముందు తీసుకోవడం మంచిది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. బరువు తగ్గించడంలో ఇది సాయపడుతుంది.
నారింజ:
ప్రతీ 100 గ్రాముల నారింజలో 47 క్యాలరీలు ఉంటాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ కల నారింజ తినడం వల్ల ఆకలి తొందరగా వేయదు. అంతేకాదు.. ఇందులో ఉండే విటమిన్ సి.. కొవ్వును కరిగిస్తుంది. రోజూ పొద్దున్నపూట నారింజలు తినడం మంచిది.
పైనాపిల్:
విటమిన్ సి తో పాటు మ్యాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా పైనాపిల్ లో ఉంటాయి. ఇందులో నీటి శాతం, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని లంచ్ తర్వాత సలాడ్ లో తీసుకుంటే బాగుంటుంది.
ఆపిల్:
ప్రతీ 100 గ్రాముల యాపిల్ లో 52 క్యాలరీలు ఉంటాయి. ఫైబర్ విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఆపిల్ ని రోజూ సాయంత్రం తినడం మంచిది.
పండ్లను గింజలతో పాటు కలిపి తీసుకుంటే బాగుంటుంది. సలాడ్స్ లో భాగంగా పండ్లతో పాటు గింజలు, మొలకలు కూడా తీసుకోవాలి.
అయితే పండ్లను అతిగా తినకూడదు. వీటిల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అందుకే పూర్తిగా పండ్లను మాత్రమే కాకుండా గింజలను తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది.