రైతులు ఏ మిల్లుకైనా ధాన్యం తీసుకెళ్లొచ్చు అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల ఆందోళన ఘటనలపై కృష్ణా జిల్లా కలెక్టర్ తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటన లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమైతే తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను పక్కాగా అమలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.
కొనుగోళ్ల అంశాన్ని నిత్యం సమీక్షిస్తూ సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 34వేల రూపాయలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు-మిల్లర్లు కుమ్మక్కై రైతులను మోసగిస్తున్నారని రైతుల మండిపడ్డారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి, అధికారులు రికార్డులలో తక్కువ చూపిస్తున్నారని తెలిపారు. మరోవైపు పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో కస్టోడియల్ ఆఫీసర్, టీఏలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.