వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు అంటూ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించే అంశం పై కలెక్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేష్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక నుంచి వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వ సమాచారం అంతా వచ్చేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. జనన, మరణాల ధృవీకరణ పత్రాల జారీకి పాటిస్తున్న విధానం పై సమీక్షించాలన్నారు. విద్యాశాఖలో ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ ఎకౌంట్ రిజిస్ట్రీ ఐడీ జారీ సమయంలో ఎదురైన ఇబ్బందులను ప్రస్తుతం మార్పు చేసి సరి చేస్తున్నట్టు తెలిపారు.
విధానాలను సగం నుంచి డిజిటలైజ్ చేయడమే కాకుండా పూర్తిగా వాటి ప్రాసెస్ ను రీ-ఇంజినీరింగ్ చేయాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో యూఏఈ మాత్రమే ఒకే ప్లాట్ ఫాం పై పౌరసేవలు అందిస్తోందన్నారు. ప్రభుత్వ సమాచారం ఒకే చోట ఉండేవిధంగా www.ap.gov.in అధికారిక వెబ్ సైట్ లో పొందు పరుస్తామని వెల్లడించారు. 153 పౌర సేవలు వాట్సాప్ ద్వారా ఇచ్చేందుకు వీలుగా కార్యచరణ సిద్ధం చేశామన్నారు.