గత ఐదేళ్లు ఇంత స్వేచ్ఛ ఉండేదా..? అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు వర్థంతి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చిందంటే పొట్టి శ్రీరాములు వల్లనే అన్నారు. 2047 విజన్ అనేది వ్యక్తి కోసం, కులం కోసం కాదని రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరి జీవితంలో మార్పు తీసుకొచ్చేందుకు ఇచ్చే హామీ అన్నారు సీఎం చంద్రబాబు.
గత ఐదేళ్లలో ఇంత స్వేచ్ఛగా మనం రాష్ట్రంలో మాట్లాడుకున్నామా..? పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశాలు ఇస్తే.. వాటిని వైసీపీ రద్దు చేసిందని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో అమరావతి పై కక్షతో వ్యవహరించారని.. పోలవరం ను నాశనం చేసి పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తరువాత ఉద్యమం వచ్చిందని.. తరువాత ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు అయిందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ఇంత అనుభవం ఉన్నా.. నాకు ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రాష్ట్రాన్ని గత ఐదేళ్లు పాలించారన్నారు.