తెలంగాణలో త్వరలో జరుగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు క్యాండిడేట్ల పేర్లను బీజేపీ ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి, కరీంనగర్-మెదక్-ఆదిలాాద్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్యను ప్రకటించారు.
అదేవిధంగా కరీంనగర్-మెదక్, ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేరును ఫిక్స్ చేసింది బీజేపీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 2025, జనవరి 10న అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల కంటే ముందే బీజేపీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ రెండు పార్టీల కంటే ముందే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు.