రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు గడుస్తున్నా.. నేటికీ రాష్ట్రంలో సమస్యలు అలాగే
ఉన్నాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ లో హైకోర్టు న్యాయవాది రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందన్నారు.
ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో
విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు నీటి వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగి పోయిందన్నారు. ఎన్నికలంటే భయం వేస్తోందని.. రానున్న రోజుల్లో పోటీ చేయలేమని’ ఆయన వ్యాఖ్యానించారు. డబ్బు లూటీ చేసే వాళ్ళు కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ప్రజలు కూడా వారికి ఓట్లు వేస్తున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.